- వాటి పక్కా డాక్యుమెంట్లు మా వద్ద ఉన్నయ్
- బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్
- 22ఏపై అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫాంహౌస్ ఉందని మొన్నటిదాకా అబద్ధాలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడేమో 67 ఎకరాలు అంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. కానీ, రేవంత్‌రెడ్డి కుటుంబం, ఆయన బిడ్డ, తమ్ముళ్ల పేరుతో ఏకంగా 308 ఎకరాల ఆస్తులున్నాయని ఆయన ఆరోపించారు. ఒక్క కొట్రా గ్రామంలోనే 300 ఎకరాల భూమి ఉందని గ్రామస్తులు చెబుతున్నారని.. అందులో 175 ఎకరాలకు సంబంధించిన పక్కా డాక్యుమెంట్లు తమ దగ్గర ఉన్నాయన్నారు.
దానికి తోడు కొండారెడ్డిపల్లిలో 77 ఎకరాలు, అఫిడవిట్ ప్రకారం మరో 54 ఎకరాలు మొత్తం కలిపి 308 ఎకరాలు రేవంత్ కుటుంబం పేరిట ఉన్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణభవన్‌లో మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు. అసెంబ్లీలో 22ఏపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
తన వ్యవసాయ భూమి వివరాలు ఎలక్షన్ అఫిడవిట్ లో, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో స్పష్టంగా ఉన్నాయని, ఒక్క గుంట కూడా అదనంగా లేదని చెప్పారు. తమ బంధువులు అమెరికాలో 30 ఏండ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో ఉండడంతో పాటు 2010 నుంచి పౌల్ట్రీ వ్యాపారంలో ఉన్నారని చెప్పారు. వారు చట్టబద్ధంగా 2019లో 'రాజ్ బ్రీడర్స్' అనే కంపెనీ షేర్లను బ్యాంకు చెక్కుల ద్వారా వైట్ మనీతో కొనుగోలు చేశారని, ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని పేర్కొన్నారు.
30 లక్షల ఎకరాలకు పెరిగిందని ఒప్పుకున్నరు
22ఏ నిషేధిత భూముల విషయంలో బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు అక్షర సత్యమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒప్పుకున్నారని హరీశ్‌రావు అన్నారు. 3.71 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో పెడితే.. అది 30 లక్షల ఎకరాలకు పెరిగిందని సీఎం చెప్పారన్నారు. దీనివల్ల ఎన్ని లక్షల కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కలెక్టర్లు దబా దబా సంతకాలు పెట్టి అప్లోడ్ చేశారని సీఎం అంటున్నారని.. మరి తప్పు చేసిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
1999 నాటి పాత జాబితాను కలెక్టర్లు అప్లోడ్ చేశారని, ప్రభుత్వం అమ్మిన హెచ్ఎండీఏ, యూఎల్సీ భూములను కూడా నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందన్న విషయాన్ని సీఎం స్వయంగా ఒప్పుకున్నారని చెప్పారు. దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి మాట్లాడినవన్నీ అర్ధసత్యాలు, అబద్ధాలు అని ఆయన విమర్శించారు. తాము సభలో ఉంటే వాళ్ల కుంభకోణాలు, కుటుంబ అవినీతి బయటపడుతుందనే భయంతోనే మొత్తం సెషన్ కి సస్పెండ్ చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ వచ్చాకే రిజిస్ట్రేషన్లు ఆగినయ్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని భూములు నిషేధిత జాబితాలో పెట్టారు? ఎన్ని తొలగించారు? అనేదానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ధరణి లేదా భూభారతిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ హయాంలో జరిగిన వ్యవహారాలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు తాము సిద్ధమని.. రేవంత్ సిద్ధమా అని సవాల్ విసిరారు. కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజిగిరి తదితర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తెలంగాణ భవన్ లో తమ సమస్యలు చెప్పుకుంటున్నారని, ముఖ్యమంత్రి, మంత్రులు తనతో కలిసి వస్తే ప్రజల మధ్య నిలబడి మాట్లాడుదామన్నారు.
కాంగ్రెస్ వచ్చాకే రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయన్న విషయం నిరూపిస్తానన్నారు. 22ఏలో అవినీతిపై ప్రశ్నిస్తుంటే.. కేసీఆర్, తమపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారన్నారు. ధరణి ద్వారా కొన్ని లక్షల ట్రాన్సాక్షన్లు నిమిషాల్లో జరిగాయని, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరిదిద్దాల్సింది పోయి, భూభారతి పేరుతో కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు
